సికిల్ సెల్ వ్యాధి

సికిల్ సెల్ వ్యాధి లేదా సికిల్ సెల్ అనీమియా లేదా కొడవలి కణ రక్తహీనత అనేది ఒక వంశానుగత రక్త రుగ్మత. సాధారణంగా మనిషి రక్తంలోని ఎర్రరక్త కణాలు గుడ్రంగా పెప్పెర్‌మింట్ల ఆకారంలో ఉంటాయి. ఈ కణాలు రక్తనాళాల ద్వారా శరీరమంతా ప్రయాణిస్తూ వివిధ అవయవాలకు ప్రాణవాయువును (ఆక్సిజన్) సరఫరా చేస్తుంటాయి. అయితే కొంతమందిలో జన్యుసంబంధ మార్పుల వల్ల ఎర్ర రక్త కణాలు కొడవలి (సికిల్) ఆకారంలోకి మార్పు చెందుతాయి. ఈ సికిల్ సెల్ ఉన్నవారి రక్తకణంలోని ఒక జన్యువు సికిల్ సెల్‌గానూ, ఒకటి మామాలుగానూ ఉన్నట్లయితే అటువంటి వారిని సికిల్ సెల్ క్యారియర్లు అంటారు. వీళ్లకి మామూలుగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అయితే వివాహం చేసుకున్న దంపతుల ఇద్దరికీ ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వారికి పుట్టే పిల్లలకు రక్తకణంలోని రెండు జన్యువులూ వంపు తిరిగి ఉంటాయి. అటువంటి పిల్లలకు పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. సాధారణ రక్త కణాల జీవితకాలం 120 రోజులైతే సికిల్ రక్త కణాల జీవిత కాలం 20 నుంచి 25 రోజులు మాత్రమే. సికిల్ రక్త కణాలు నశించి పోయేంత వేగంగా కొత్త ఎర్రరక్త కణాలు ఉత్పత్తి కాకపోవడంతో ఈ వ్యాధి ఉన్నవారు రక్తహీనతకు గురవుతారు. అంతేకాక సికిల్ రక్తకణాలు వంపుతిరిగి ఉండటం వల్ల సన్నటి రక్తనాళాల్లో సరిగ్గా ప్రవహించలేక శరీర భాగాలకు ఆక్సిజన్ అందటం తగ్గిపోతుంది. అందువల్ల ఈ వ్యాధి ఉన్నవారు తగిన చికిత్స తీసుకోకపోతే తక్కువ వయసులోనే పది, పదిహేనేళ్ల లోపు చనిపోతారు.

సికిల్ సెల్ వ్యాధి
Classification and external resources

ఫిగర్ (A): సిరల ద్వారా స్వేచ్ఛగా ప్రవహించే సాధారణ ఎర్ర రక్త కణాలు చూపిస్తుంది. ప్రక్క అంతర చిత్రం సాధారణ హిమోగ్లోబిన్ తో ఉన్న సాధారణ ఎర్ర రక్త కణం యొక్క క్రాస్ విభాగాన్ని చూపిస్తుంది. ఫిగర్ (B): సిరలో శాఖా పాయింట్ వద్ద అంటుకొని గుట్టగా ప్రోగయి జామింగ్ అయిన కొడవలి ఆకారములో ఉన్న అసాధారణ ఎర్ర రక్త కణాలు చూపిస్తుంది. ఈ ప్రక్క అంతర చిత్రం దీర్ఘ పాలిమరైజ్ hbs తంతువులు సాగతీతగా మరియు కణ ఆకారం వంకరగా ఉన్న సికిల్ సెల్ అడ్డుకోతను చూపిస్తుంది.
ICD-10 D57
ICD-9 282.6
OMIM 603903
DiseasesDB 12069
MedlinePlus 000527
eMedicine med/2126 oph/490 ped/2096 emerg/26 emerg/406
MeSH C15.378.071.141.150.150
GeneReviews

జన్యుపరమైన మార్పుల వచ్చే ఈ రక్తహీనత జబ్బుకు సరైన మందులు లేవు.

ఆంధ్రప్రదేశ్ లో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఉన్న దాదాపు 10 లక్షల గిరిజన జనాభాలో కనీసం పది శాతం మందికి ఈ జబ్బు లక్షణాలు ఉన్నాయి. అంటే ఈ లెక్కన లక్ష మందికి సికిల్ సెల్ అనీమియా లక్షణాలు ఉండవచ్చని వివిధ సంస్థల అంచనాలు తెలియజేస్తున్నాయి. ఈ వ్యాధికి గురై మరణించే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. విశ్వవిద్యాలయ స్థాయిలో ఆంధ్రా యూనివర్సిటీ "హ్యూమన్ జెనెటిక్స్" విభాగం వారు జరిపిన పలు శాంపిల్ సర్వేల లెక్కల ప్రకారం ఉత్తరాంధ్ర ఏజెన్సీ పరిసర గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనేతర కులాల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయి.

భారతదేశంలో

భారతదేశంలోని అధిక రాష్ట్రాలలో ఈ వ్యాధి నివారణకు ప్రత్యేక నివారణ ప్రాజెక్టులను చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రత్యేక పరిశోధనాలయం కూడా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ వ్యాధి నివారణకు దీనిపై పరిశోధనకు రాయ్‌పూర్‌లో ప్రత్యేకంగా సికిల్ సెల్ ఇన్‌స్టిట్యూట్‌నే నెలకొల్పి 12.43 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు జరిపారు. సికిల్ సెల్ అనీమియాను కట్టడి చేయడంలో గుజరాత్ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోంది. 2008లో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులు అధికంగా ఉండే 12 జిల్లాల్లో సికిల్ సెల్ అనీమియా కంట్రోల్ ప్రాజెక్టును చేపట్టింది. గుజరాత్ లో 18.28 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు జరిపి జబ్బుతో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించి, సికిల్ సెల్ క్యారియర్ల మధ్య వివాహాలు జరగకుండా వారిని చైతన్య పరచి మంచి ఫలితాలు సాధించారు. కేరళలో ఈ వ్యాధి బారిన పడినవారికి వైద్య ఖర్చులు (రూ.20 వేలు) ఇస్తున్నారు.

వ్యాధి లక్షణాలు

దీర్ఘకాలం కామెర్లు ఉండటం, రక్తహీనతతో శరీరం పాలిపోయి ఉండటం, కాళ్లు, చేతుల వేళ్లు వాపుతో వంపు తిరిగి ఉండటం, ప్లీహం వాచిపోయి ఉండటం ఈ సికిల్ సెల్ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు.

వ్యాధి నిర్ధారణ పరీక్ష

ఈ వ్యాధి నిర్ధారణకు జరిపే ప్రాథమిక రక్త పరీక్ష ఖరీదు చాలా తక్కువలోనే (10 రూపాయల లోపే) ఉంటుంది. రక్త నమూనాను సోడియం మెటా బై సల్ఫేట్‌లో కలిపి మైక్రోస్కోప్ కింద చూస్తే రక్తకణాలు గుండ్రంగా ఉన్నాయా? వంపు తిరిగి ఉన్నాయా? అని తెలుసుకోవడం ద్వారా వ్యాధి ఉందా, లేదా అని నిర్ధారించుకోవచ్చు. ఈ ప్రాథమిక పరీక్షను ప్రాథమిక ఆరోగ్య కేంద్ర (PHC) స్థాయిలోనే జరపవచ్చు.

సికిల్ సెల్ వ్యాధి నివారణ

సికిల్ సెల్ వ్యాధి చికిత్సకు సరైన మందులు లేనందున, సికిల్ సెల్ క్యారియర్లను గుర్తించి వారి మధ్య వివాహాలను నిరోధించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ వ్యాధిని త్వరితంగా నివారించాలని, నివారించకపోతే దుష్పరిణామాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

గిరిజన ప్రాంతాల్లో ఈ వ్యాధి అధికంగా

ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో అయితే తరచూ మలేరియా బారిన పడ్డారో ఆ ప్రాంతాల్లో ఈ సికిల్ సెల్ అనీమియా అధికంగా కనిపిస్తోంది. దోమల ఎక్కువగా ఉండే ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఎప్పుడూ మలేరియా బారిన పడుతుంటారు. అయితే సికిల్ సెల్ అనీమియా ఉన్నవారికి మలేరియా సోకదు. ఎందుకంటే వీరి ఎర్ర రక్త కణం వంపు తిరిగి, కాస్త బిరుసుగా ఉండటం వల్ల మలేరియా పరాన్నజీవి ఈ ఎర్ర రక్త కణాల్లోకి జొరబడలేదు. దీనిని బట్టి శాస్త్రవేత్తలు తరాల తరబడి మలేరియాకు గురవుతున్న వారి శరీరంలో మలేరియాను తట్టుకునే విధంగా జన్యుమార్పిడి జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

మూలాలు

    • సాక్షి దినపత్రిక - 04-02-2015 - (మన్యంలో మహమ్మారి - ఏమిటీ వింత జబ్బు?)
    • సాక్షి దినపత్రిక - 05-02-2015 - (గిరిజనేతరుల్లోనూ సికిల్ సెల్)
    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.